న్యూఢిల్లీ : శాంతి దూత , జాతిపిత గాంధీజీ వర్ధంతి రోజు ఢిల్లీలో ఒక ఉన్మాది రెచ్చిపోయాడు. సీఏఏకి వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై అకస్మాత్తుగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అజాదీ కావాలా అంటూ అగంతకుడు ఆందోళనకారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకొన్నారు. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించిన అధికారులు ట్రాఫిక్‌ను దారి మళ్లించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
షాహీన్‌బాగ్ వద్ద నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను బుధవారం తుపాకీతో బెదిరించిన మహ్మద్ లుఖ్మాన్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి తుపాకితో వ్యక్తి హల్ చల్ చేయడంపై ఆందోళనకారులు మండిపడుతున్నారు. మరోవైపు గత ఆరు వారాలుగా సీఏఏకు వ‍్యతిరేకంగా షాహీన్ బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న వందలాది మంది మహిళలు గాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఈ రోజు శాంతి ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. జామియా మిలియా ఇస్లామియా నుంచి మహాత్మా గాంధీ స్మారక చిహ్నం రాజ్‌ఘాట్ వరకు చేపటనున్నఈ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.