అక్రమ నల్లాలపై కదులుతున్న డొంక!

 సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో అక్రమ నల్లాల తీగ లాగితే డొంక కదులుతోంది .నగర పరిధిలో వేలాదిగా ఉన్న ఆక్రమ నల్లాల భరతం పట్టేందుకు జలమండలి చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాన్నిస్తోంది. ఇప్పటి వరకు 6 నిర్వహణ డివిజన్ల పరిధిలో చేపట్టిన సర్వేలో 1600 అక్రమ నల్లాల భాగోతం బయటపడింది. మరో ఆరువేల నల్లా కనెక్షన్ల కేటగిరి మార్పుతో జలమండలికి అదనపు ఆదాయం సమకూరింది. అక్రమ నల్లాలను వీడీఎస్‌ పథకం కింద క్రమబద్ధీకరించడం, జరిమానాలు, నల్లా కనెక్షన్‌ ఛార్జీల రూపంలో బోర్డుకు రూ.11.66 కోట్ల ఆదాయం లభించింది. నెలవారీగా మరో రూ.33.30 లక్షల అదనపు ఆదాయం నల్లా బిల్లుల ద్వారా సమకూరుతోంది. ఇంటింటి సర్వే ప్రక్రియను మరో 14 నిర్వహణ డివిజన్ల పరిధిలో కొనసాగించడం ద్వారా జలమండలి రెవెన్యూ ఆదాయాన్ని గణనీయం గా పెంచాలని బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం విశేషం. ఈ సర్వే ద్వారా మహా నగరం పరిధిలో ఉ న్న సుమారు 50 వేల అక్రమ నల్లాల బండారం బయటపడుతుందని బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటి లెక్క తేలితే జలమండలికి ఆర్థిక కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.